దళిత బంధుకు హుజూరాబాద్ ఎలక్షన్ కలిసొచ్చింది

దళిత బంధుకు హుజూరాబాద్ ఎలక్షన్ కలిసొచ్చింది
  • మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: టైం కలిసి వచ్చింది కాబట్టే దళిత సాధికారత పైలట్ ప్రాజెక్టు హుజురాబాద్ లో మొదలు పెడుతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్ లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాజకీయాలు చేయదలుచుకున్న వారు ఎక్కడైనా చేస్తారని చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. ఎరువులు , రసాయనాల విషయం రాష్ట్రానికి రావాల్సిన వాటా పై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నామన్నారు. నది జలాల విషయంలో కేంద్రం ఇచ్చిన గెజిట్ పై జాతీయ పార్టీలు మరోసారి అక్కసు వెళ్లగక్కేలా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మిగిలిన రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని ఎందుకు ఎండగట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర పార్టీల ఎంపీలు గెజిట్ పై పార్లమెంట్ సమావేశాల్లో ఎం మాట్లాడుతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పరమైన లబ్దికోసమే మాట్లాడుతున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలకు లోబడి ఏ పార్టీ నోరు విప్పడం లేదన్నారు.
నిరుద్యోగులకు హమాలీపని.. నా  ఉద్దేశం అదికాదు..  అయినా బాధపెట్టి ఉంటే సారి: మంత్రి నిరంజన్ రెడ్డి
నిరుద్యోగులకు హమాలి పని దొరుకుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. నిన్న మాట్లాడిన దానికి సోషల్ మీడియా లో ట్రోల్  అవుతున్న దానికి సంబంధం లేదన్నారు. తెలంగాణ సర్కారు ఏ గ్రామానికి ఆ గ్రామంలో కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేస్తుందని చేసిన వ్యాఖ్యలకు నిరుద్యోగ యువతకు ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వందకు వంద శాతం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలో నోటిఫికేషన్ కు సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. యువత పూర్తిస్థాయిలో ఉద్యోగ అవకాశాల మీద దృష్టి పెట్టి అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. నా వ్యాఖ్యల విషయంలో అవాస్తవలను ప్రచారం చేశారు.. అయినా ఎవరైనా బాధపడితే క్షమించమని అడుగుతున్నానని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.